Friday, April 15, 2011

పెట్టుబడిదారీ విధానంపై భ్రమలు కోల్పోతున్న అమెరికన్లు

పెట్టుబడిదారీ విధానంపై భ్రమలు కోల్పోతున్న అమెరికన్లు

అమెరికా అప్పు 14 లక్షల కోట్ల డాలర్లు. చేస్తున్న ప్రతి వంద డాలర్ల ఖర్చుకు 40 డాలర్లను అప్పుదెచ్చుకోకపోతే గడవటం లేదు. దీన్ని తగ్గించుకోకపోతే రానున్న రోజుల్లో సమస్యలు వస్తాయి. అప్పు తగ్గాలంటే సంక్షేమ చర్యలకు కోత తప్ప ధనికులపై భారం మోపటానికి అక్కడి పాలకవర్గం ససేమిరా అంటోంది. అక్కడి జనాభాలో పైన ఉన్న ఒకశాతం మంది నాల్గోవంతు దేశ సంపదను కలిగి ఉన్నారు. ఎం కోటేశ్వరరావు
ప్రపంచ భవిష్యత్‌కు స్వేచ్ఛా మార్కెట్‌, స్వేచ్చా ఆర్థిక వ్యవస్థ మంచి విధానం అని మీరు అంగీకరిస్తారా అని గ్లోబ్‌ స్కాన్‌ అనే సంస్థ 25 దేశాలకు చెందిన వారిని ప్రశ్నించింది. సర్వే వివరాలను ప్రకటించిన దాని అధిపతి డగ్‌ మిల్లర్‌ మాట్లాడుతూ మేం అనుకున్నట్లుగానే తమ ప్రశ్నకు అంగీకారం తెలిపిన వారిలో అమెరికన్లు చివరి స్థానంలో ఉన్నారని చెప్పారు. తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న వేసినపుడు 80శాతం మంది అమెరికన్లు అవునని చెప్పగా గతవారంలో ఆ సంఖ్య 59కి పడిపోయింది. వారిలో కూడా గట్టిగా అవునన్నవారు 37శాతం అయితే 22 శాతం మంది అవునని,కాదని చివరకు అవునన్నారట. మరొక విశేషమేమంటే మరొక సర్వేలో పదిశాతం మంది అమెరికన్లు నైతికంగా తమ పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజమే మంచిదని అభిప్రాయపడుతున్నారని వెల్లడైంది. మరో పదిశాతం మంది పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజం గొప్పదని చెప్పలేమన్నారట. అంటే అమెరికాలో 20శాతం మంది పెట్టుబడిదారీ విధానం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారని చెప్పవచ్చు. అమెరికన్ల ఆలోచనలో ఈ మార్పు ఎలా వచ్చింది? కారణాలేమిటి?
అమెరికా బడ్జెట్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష అధికార పార్టీలు తర్జన భర్జనలు పడ్డాయి.ఈనెల ఎనిమిదవ తేదీలోగా బడ్జెట్‌ ఆమోదం పొందక పోతే(మనకు మార్చి31) మొత్తం ప్రభుత్వమే మూతపడుతుందని జనాన్ని భయపెట్టారు. అందుకుగాను ఏదోఒకటి చేయాలన్నట్లుగా ఫోజు పెట్టి చివరకు తామనుకున్న 38.5 బిలియన్‌ డాలర్ల కోతను ఆమోదించారు. దీనివలన ప్రధానంగా నష్టపోయేది కార్మికులు, విద్యార్ధులు, వైద్యబీమా లేని పిల్లలు, పేదవారు. నిజానికి గడువులోగా బడ్జెట్‌ను ఆమోదించకపోతే ఏమౌతుంది? ఏమీ కాదని 1995లో అమెరికా ఉదంతమే నిరూపించింది. అప్పుడు జరిగిన దానిని బట్టి కార్మికులు, ఉద్యోగుల వేతనాలు మాత్రమే నిలిచిపోతాయి. విదేశాల్లో అమెరికన్లు చేస్తున్న యుద్ధాలకు, చేస్తున్న కుట్రలకు, గూఢచర్యానికి ఎలాంటి నిధుల ఆటంకం ఉండదు. అయినా యుగాంతం అవుతుందన్న రీతిలో మీడియా బూతద్దంలో చూపింది. ఒక్కటి మాత్రం జరగటం ఖాయం బడ్జెట్‌ను సకాలంలో ఆమోదించకపోతే ఒబామా సర్కార్‌ సామర్ధ్యంపై మదుపుదార్లకు నమ్మకం పోతుంది. రాజకీయంగా ఆయన పరువు మిసిసిపీ నదిలో కలుస్తుంది. ఇంతకు మించేమీ కాదు. దీనికి ముందు అధికార పక్షంలోని కొందరు ఎంపీలు, ఇతర అభ్యుదయ వాదులు 'ఒక ప్రజా బడ్జెట్‌'ను ప్రతిపాదించారు.
దాని ప్రకారం ధనికులపై కొద్దిగా పన్నులను పెంచి, ఆయుధాలు, యుద్ధాలపై చేస్తున్న ఖర్చును తగ్గిస్తే 2021 నాటికి లోటు బడ్జెట్‌ పోయి మిగులుతుందని, రుణ భారం జిడిపిలో 65శాతానికి తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికా భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే 2013 నుంచి అత్యవసర యుద్ధ నిధిని నిలిపివేస్తే 1.6లక్షల కోట్ల డాలర్లను పొదుపు చేయవచ్చని, ఇరాక్‌, ఆఫ్ఘన్‌ యుద్ధాలను విరమించి, సాధారణ మిలిటరీ కార్యకలాపాలకు పరిమితం కావాలని ప్రతిపాదించారు. కానీ అమెరికాలో మార్పుకోసం తీర్పిమ్మని గద్దెనెక్కిన డెమోక్రాట్‌ బరాక్‌ ఒబామా రిపబ్లికన్‌ అధ్యక్షులైన రీగన్‌, జూనియర్‌ బుష్‌ బూట్లలో కాళ్లు పెట్టి నడుస్తున్నట్లు తాజాగా బడ్జెట్‌ ఆమోదానికి ప్రతిపక్షంతో రాజీ పడిన తీరు వెల్లడించింది. బుధవారం నాడు జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ఉపన్యసిస్తూ తన చర్యను పూర్తిగా సమర్ధించుకున్నాడు. వర్తమాన ఆర్థిక సంక్షోభ సమయంలో పేద, మధ్యతరగతిని ఫణంగా పెట్టి కార్పొరేట్ల సేవలో ఒబామా తరించటమే అమెరికన్లలో పైన పేర్కొన్న మార్పుకు కారణం అని వేరే చెప్పనవసరం లేదు. తాజా బడ్జెట్‌ కోతలను గమనించిన తరువాత ఈ మార్పు మరింత వేగం అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. సామాన్యులను గాలికి వదలి ధనికుల సేవలో తరించిన మధ్యప్రాచ్య దేశాలలో జనం ఏ విధంగా తిరగబడుతున్నారో ప్రపంచంలో ఇతరులతో పాటు అమెరికన్లూ వీక్షిస్తున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్ణయించుకోవటానికి ఈ పరిణామాలెంతగానో దోహదం చేస్తాయని వేరే చెప్పాలా? విస్కాన్సిన్‌ రాష్ట్రంలో జరిగింది అదే. అది ఆరంభం మాత్రమే.
ఈ ఏడాది అమెరికా బడ్జెట్‌ చర్చ సందర్భంగా వర్తమాన సంవత్సరంలో ఎంత మేరకు కోత పెట్టాలనే అంశంతో పాటు రానున్న పది సంవత్సరాలలో కోత ఎంత ఉండాలనే అంశం కూడా ముందుకు వచ్చింది. అధికారంలో ఉంది డెమోక్రాట్లయినా ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రతిపాదించిన కోతలకు అధికార పక్షం, అధ్యక్షుడు అంగీకారం తెలపటం గమనించాల్సిన అంశం. అయితే తమ పరువు నిల్పుకోవటానికి, వచ్చే ఏడాది ఎన్నికలలో గెలవటానికి ఒబామా కూడా జిమ్మిక్కులకు పాల్పడ్డారు. వాటిలో ఒకటేమిటంటే రిపబ్లికన్లు పదేళ్లలో 4.4లక్షల కోట్ల డాలర్లమేరకు బడ్జెట్‌లోటును తగ్గించాలంటే తాను వారి మెడలు వంచి నాలుగు లక్షల కోట్లకు వప్పించానని చెప్పుకోవటం. ఈ ఏడాది కోతను కూడా వారు ప్రతిపాదించిన దాని కంటే తగ్గించానని తనను తానే అభినందించుకున్నాడు. అధ్యక్ష భవనం తన వెబ్‌సైట్లలో కోతల వివరాలను వెల్లడించింది. దాని ప్రకారం రానున్న 12 సంవత్సరాల్లో మిలిటరీఖర్చు 400 బిలియన్‌ డాలర్లను తగ్గించాలని ప్రతిపాదించగా ఇదే సమయంలో విద్య, ఆరోగ్య ఖర్చును 770 బిలియన్‌ కోట్లు తగ్గిస్తారు. ఇప్పటికే విద్యాపరంగా సాధారణ అమెరికన్లు ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకంటే ఎంతో వెనుకబడి ఉన్నారని నోబెల్‌ బహుమతి పొందిన ఆర్థికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ వ్యాఖ్యానించిన పూర్వరంగంలో ఈ కోతలతో మరింతగా దిగజారటం ఖాయం. గతేడాది ఒబామా సర్కార్‌ వైద్యరంగంలో లక్షకోట్ల డాలర్ల పొదుపు చర్యలను ప్రకటించింది. దీంతో బీమా పరిధిలోకి రానివారి సంఖ్య రానున్నరోజుల్లో మరింతగా పెరగనుంది.
అమెరికా అప్పు 14లక్షల కోట్ల డాలర్లు. చేస్తున్న ప్రతి వందడాలర్ల ఖర్చుకు 40 డాలర్లను అప్పుదెచ్చుకోకపోతే గడవటం లేదు. దీన్ని తగ్గించుకోకపోతే రానున్న రోజుల్లో సమస్యలు వస్తాయి. అప్పు తగ్గాలంటే సంక్షేమ చర్యలకు కోత తప్ప ధనికులపై భారం మోపటానికి అక్కడి పాలకవర్గం ససేమిరా అంటోంది. అక్కడి జనాభాలో పైన ఉన్న ఒకశాతం మంది నాల్గోవంతు దేశ సంపదను కలిగిఉన్నారు. కార్పొరేట్లపై గతంలో ఉన్న గరిష్టపన్ను 74శాతాన్ని గత మూడు దశాబ్దాల్లో 30శాతానికి తగ్గించారు. ఇప్పుడు దాన్ని 25శాతానికి తగ్గించాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ఫలితంగా దేశ ఆదాయంలో 30శాతంగా ఉండాల్సిన పన్ను వాటా ఇప్పుడు కేవలం 7శాతానికి పడిపోయింది. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు రూపొందించిన రాజ్యాంగం అన్నమాదిరి అమెరిన్లలో ఒకశాతంగా ఉన్న ధనికులు, ఒకశాతంతో, ఒకశాతం ధనికుల కొరకు రూపొందించిన పన్నుల విధానం ప్రస్తుతం అమెరికాలో అమలు జరుగుతోందని ఒక పత్రిక శీర్షిక పెట్టింది. గత రెండు దశాబ్దాలుగా కనిపించని శత్రువు పేరుతో వందలాది బిలియన్‌ డాలర్లను ఆయుధాలకోసం అమెరికా తగలేస్తున్నదని స్టిగ్లిజ్‌ వంటి వారు చెబుతున్నారు. సామాజిక సంక్షేమానికి కోతల రద్దు, అప్పులు తీరాలంటే కార్పొరేట్లపై ఇప్పుడున్నదానిపై కేవలం మూడుశాతం పెంచితే చాలని అన్నారు.
ఒబామా సర్కార్‌ పేదల సంక్షేమానికి ఏడాదికి 38.5 బిలియన్‌ డాలర్ల ప్రత్యక్ష కోత పెట్టింది. అదే ప్రభుత్వం వారానికి రెండు బిలియన్‌ డాలర్ల చొప్పున ఆఫ్ఘనిస్తాన్‌ యుద్దానికి తగలేస్తోంది. ఇరాక్‌ ఖర్చు అదనం అని గమనించాలి. అందుకే పాలకవర్గం కమ్యూనిజం గురించి ఎంత వ్యతిరేకతను నూరిపోసినా తమ బతుకులు దిగజారటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న, కమ్యూనిస్టు చైనా నుంచి ప్రతి వస్తువును దిగుమతి చేసుకోవటాన్ని గమనించిన సాధారణ అమెరికన్లు క్రమంగా కమ్యూనిజంపై వ్యతిరేక భావాన్ని సడలించుకోక తప్పటం లేదు.


No comments:

Post a Comment